26, ఆగస్టు 2012, ఆదివారం

బిగ్ స్క్రీన్ కు స్మాల్ స్క్రీన్ ఛాలెంజ్

బిగ్ స్క్రీన్ కు స్మాల్ స్ర్కీన్ ఛాలెంజ్ చేస్తోంది. చాలా స్పీడుగా దూసుకెళ్తున్న టెలీవుడ్... బిగ్ స్క్రీన్ కు దడపుట్టిస్తోంది. బడాబడా ప్రొడ్యూసర్లు కూడా టీవీ రియాలిటీ షోలు, ప్రోగ్రాంలు రూపొందించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. హిందీలో జితేంద్ర కుమార్తెలు శ్రీ బాలాజీ టెలీ ఫిలీంస్ పతాకంతో అరంగేట్రం చేసి ప్రస్తుతం పలు భాషల్లో సీరియల్స్ నిర్మిస్తూ... దాదాపు 500 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. దక్షిణాదిలో రాధిక... రాడాన్ పిక్చర్స్ పై సీరియళ్లు నిర్మిస్తూ వాటిని పలు భాషల్లోకి డబ్బింగ్ చేస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ చేస్తోంది. మన వద్ద గతంలో సురేష్ ప్రొడక్షన్స్ సీరియల్స్ తీయగా... ప్రస్తుతం దాసరి సౌభాగ్య మీడియా పతాకంపై, అక్కినేని అన్నపూర్ణ సంస్థ, శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల, అశ్వనీదత్ వైజయంతి సంస్థ, రామోజీరావు ఉషాకిరణ్ సంస్థ తెలుగు సీరియళ్లు, ఇతర కార్యక్రమాల రూపకల్పనలో మంచి జోరుమీదున్నాయి. ఇవేకాక అనేక సంస్థలు సీరియల్స్, గేమ్ షోలతో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.
                   బడా స్టార్లు కూడా ఈ బుల్లితెరపై కనిపించడానికి ఆరాటపడుతున్నారు. సినిమాలో నటించాలనే ఎంతోమందికి ఈ రంగుల కల... కలగానే మిగిలిపోతోంది. అలాంటివారి కల నిజం చేస్తోంది టీవీ తెర. స్మాల్ స్క్రీన్ ను ఓ వేదికగా మలుచుకుని వెండితెరపై వెలిగిపోవాలని తపించేవారు ఎందరో. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా బుల్లితెరనే కావడం విశేషం. మరోవైపు ఇన్నాళ్లు సినిమాల్లో అదరగొట్టిన సినీతారలు బుల్లితెరపై కనిపిస్తున్నారు. అందం, అభినయంతో వెండితెరపై అలరించిన హీరోయిన్లు ఎందరో స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు. మీనా, సిమ్రన్, రాశి, రోజా, ఆమని అందుకు ఉదాహరణ. బాలీవుడ్ బడాస్టార్లు... అటు బిగ్ బీ నుంచి ఇటు హీరోయిన్ల వరకు అందరూ రియాలిటీ షోల్లో అదరగొట్టిన... అదరగొడుతున్నవారే.
         ఒకప్పుడు యాడ్లలో తప్ప టీవీ తెరపై కనిపించడానికి ఇష్టపడని హీరోలు సైతం ఇప్పుడు బుల్లితెరపై కనిపించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటే... టెలీవుడ్ ఏ రేంజ్ కు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులకు చేరువ కావడంతోపాటు... రియాలిటీ షోలతో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు. సినిమా ఫంక్షన్ల నుంచి మ్యారేజ్ ల వరకు టీవీలలో లైవ్ కవరేజ్ ఇస్తున్నారంటే... స్మాల్ స్క్రీన్ సత్తాను అంచనా వేయొచ్చు. అందుకే ప్రస్తుత పరిస్థితులను చూస్తే టెలివిజన్ రంగం వెండితెరకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నట్లే కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 525 టీవీ ఛానెల్స్ లో 55 వరకు ఛానెళ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వీటిలో సగం ఎంటర్ టైన్మెంట్ ఛానళ్లే. వేలాదిమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లకు ఉపాధి మార్గంగా మారాయి ఈ ఛానెళ్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి