1, అక్టోబర్ 2012, సోమవారం

స్టెప్పులేసి అదరగొట్టిన శ్రీదేవీ, మాధురీ, అమితాబ్

కలర్స్ ఛానల్ నిర్వహించిన ఝలక్ దిక్ లాజా గ్రాండ్ ఫినాలేలో శ్రీదేవీ, మాధురీ దీక్షిత్ స్టెప్పులేసి అదరగొట్టారు. ఒకనాటి ప్రత్యర్థులు ఇద్దరూ ఒకేవేదికపైకి రావడం.... కలిసి డ్యాన్స్ చేయడం బాలీవుడ్ లో సంచలనం రేపింది. అదికూడా ఒకరి పాటపై మరొకరు డ్యాన్స్ చేసి ఆడియన్స్ ను అలరించారు. పనిలోపనిగా తాను నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ప్రమోషన్ కూడా చేసింది ఒకనాటి అందాల సుందరి శ్రీదేవి.


             కౌన్ బనేగా కరోడ్ పతి షోలో బిగ్ బి అమితాబ్ తో కలిసి స్టెప్పులేసి హంగామా చేసింది శ్రీదేవి. ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం (అక్టోబర్ 7న) సోనీ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారం కానుంది. 20 ఏళ్ల తర్వాత అమితాబ్, శ్రీదేవీ జోడీ స్టెప్పులేయడం రియల్లీ వండరే. 1992లో వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కుదాగవా. ఆ తర్వాత ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతిలో డ్యాన్స్ చేసి పాతరోజులను షేర్ చేసుకున్నారు. ఇక్కడ కూడా శ్రీదేవీ ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాను ప్రమోట్ చేయడం విశేషం.


8, సెప్టెంబర్ 2012, శనివారం

అమితాబ్ రాణి ఐశ్వర్య

అందంతో మైమరిపించే అప్సరసలాంటి సుందరి ఐశ్వర్య. ఈ నీలికళ్ల ముద్దుగుమ్మ చోటా బచ్చన్ అభిషేక్ కు భార్య. ఆల్ ఇండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కోడలు. మరి కోడలిని అమితాబ్ ఏమని సంబోధిస్తారు? కోడలా అంటారా? ఐశ్వర్య అని పిలుస్తారా? ఇవేమీ కాదు... తన అందాల కోడలిని రాణిలా భావిస్తారు అమితాబ్. అందుకే బహురాణి అని ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చనే... కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షోలో వెల్లడించారు. భార్య మీకు రాణిలాంటిది కదా అని ఓ కంటెస్టెంట్ తో అన్నాడు అమితాబ్...అదే సందర్భంలో తను తన కోడలిని రాణి అని సంబోధిస్తానని వెల్లడించాడు బిగ్ బి.

6, సెప్టెంబర్ 2012, గురువారం

కౌన్ బనేగా కరోడ్ పతి వచ్చేసింది

 రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి ఈరోజు(శుక్రవారం)నుంచి వచ్చేస్తోంది. ఈ షోలో ఇంట్లో కూర్చుని ప్రోగ్రాం చూసే ప్రేక్షకులను సైతం ఇన్వాల్వ్ చేస్తోంది సోనీ టీవీ. ఘర్ బైటే జీతో జాక్ పాట్ అంటూ రిజిస్ట్రేషన్లను ఇటీవలే ముగించింది. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) సీజన్6తో అందరినీ అలరించడానికి బిగ్ బి రెడీ అయ్యాడు. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే అతి పెద్ద రియాలిటీ మనీ గేమ్ షో ఇది. పేరుకు తగ్గట్లే ఇప్పటికే కొంతమందిని కోటీశ్వరులను... మరెంతోమందిని లక్షాధికారులను చేసింది. మేనెలలో రిజిస్ట్రేషన్లు ముగించిన కేబీసీ... సరికొత్తగా రూపుదిద్దుకుంది. వారంలో మూడు రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాలు రోజూ రాత్రి 8.30 గంటలకు ఈ ప్రోగ్రాం అలరించనుంది.
         కేబీసీలో పాల్గొనే చాన్స్ రాలేదని నిరాశపడే ప్రేక్షకులకు సోనీ టీవీ మరో ఛాన్స్ ఇస్తోంది. ఘర్ బైటే జీతో జాక్ పాట్ పేరుతో మళ్లీ రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది. ఈ కాంటెస్ట్ లో ఆడియన్స్ ఇంట్లో కూర్చునే షో మధ్యలో అడిగే ప్రశ్నలకు సమాధానం పంపాల్సి ఉంటుంది. ఇందులో రాండంగా సెలక్షన్ చేస్తారు. ఎంపికయితే... ప్రైజ్ మనీగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తారు. ఘర్ బైటే జీతో జాక్ పాట్... గత 5 సీజన్లకంటే భిన్నం. ఇక ఈ షో విజేతకు రూ.5 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది. సీజన్ 5లో బీహార్ కు చెందిన సుశీల్ కుమార్ రూ.5 కోట్లు గెలుచుకుని విజేతగా నిలిచాడు. 
   2000 సంవత్సరంలో రూపం పోసుకున్న ఈ గేమ్ షోకు మూలం యునైటెడ్ కింగ్డమ్ లోని హూవాంట్స్ టు బి ఎ మిలియనీర్ ప్రోగ్రాం. కేబీసీని స్టార్ ఛానెల్ ప్రసారం చేసినప్పుడు దేశంలో ఓ పెద్ద సంచలనం. దీనికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.... యాంకరింగ్ చేయడం మరో సంచలనం. అప్పటివరకూ టీవీల్లో యాడ్స్ లో మాత్రమే కనిపించే బిగ్ బి... బుల్లితెర యాంకర్ గా మారడం నిజంగా చర్చనీయాంశమైంది. ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన ఈ షో... ఫస్ట  సీజన్ నుంచి గత 5 సీజన్ల వరకు సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఒక్క మూడో సీజన్ లో తప్ప బిగ్ బి.... అన్ని సీజన్లకు తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ గేమ్ షోకు మంచి పాపులారిటీ తెచ్చారనడంలో సందేహం లేదు.

29, ఆగస్టు 2012, బుధవారం

బాలీవుడ్ స్టార్లకు కాసులు కురిపిస్తున్న బుల్లితెర

 ఈ మధ్య ఏ నేషనల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ చూసినా బాలీవుడ్ స్టార్లతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. మరి బాలీవుడ్ హీరోహీరోయిన్లంతా బుల్లితెర బాట పట్టడానికి కారణమేంటి? బిగ్ స్క్రీన్ బోర్ కొట్టిందా? లేక స్మాల్ స్క్రీన్ పై మోజు పెరిగిందా? ఇవేవీ కావు... బుల్లితెర బాలీవుడ్ హీరోలకు కాసులు కురిపిస్తోంది. అందుకే బాలీవుడ్ స్టార్లంతా స్మాల్ స్క్రీన్ బాట పట్టారు. త్వరలో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 6తో అమితాబ్, బిగ్ బాస్ సీజన్ 6తో సల్మాన్ ఖాన్ బుల్లితెరపై మరోమారు సందడి చేయనున్నారు. 
  ఏ ముహూర్తాన అమితాబ్ బుల్లితెరపై అడుగుపెట్టారోగానీ అప్పటి నుంచి బాలీవుడ్ స్టార్లకు స్మాల్ స్క్రీన్ పై బాగా కలిసొస్తోంది. యాంకర్లుగా, హోస్టులుగా రాణిస్తున్నారు. అంతేకాదు సినిమాలకు వసూలు చేసినదానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
      సత్యమేవ జయతే ప్రోగ్రాం ద్వారా సామాజిక సమస్యలను లేవనెత్తి దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న అమీర్ ఖాన్. వారానికి ఒకసారి ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి కోట్లాది మంది వీక్షకులున్నారు. సత్యమేవ జయతే ప్రతి ఎపిసోడ్ కు అమీర్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం దాదాపు మూడున్నర కోట్లు. అంటే నెలలో నాలుగు ఎపిసోడ్లు చేస్తే... అతడికి వచ్చే  రెమ్యూనరేషన్ 28 కోట్లు. ఒక సినిమా నెలరోజుల్లో కంప్లీట్ కాదు. అంటే ఒకసినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే అన్నమాట.
           హ్రుతిక్ రోషన్ కూడా ఏ హై జల్వా షోకి వచ్చాడు. ఈ హీరో వారానికి 2 కోట్ల చొప్పున అందుకున్నాడు. హ్రుతిక్... జస్ట్ డ్యాన్స్ షో మొత్తం ఎపిసోడ్ లకు కలిపి 112 కోట్లు అందుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.
      బాలీవుడ్ హీరోల టెలివిజన్ ఎంట్రీ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి షోకు మొదట్లో ఎపిసోడ్ కు 50 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారు. ఈ రియాలిటీ గేమ్ షో ఊహించినదానికంటే ఎక్కువ పాపులర్ కావడంతో... ఇక రెండో సీజన్ లో రేటు పెంచేశారు అమితాబ్. ఒక్కో ఎపిసోడ్ కి కోటి డిమాండ్ చేశారు. ఆ తర్వాత బిగ్ బి ద్రుష్టి బిగ్ బాస్ రియాలిటీ షోపై పడింది. ఈ ప్రోగ్రాంను నిర్వహించేందుకు సింగిల్ ఎపిసోడ్ కు కోటి 75 లక్షలు అందుకున్నారు.   
         ఇక కౌన్ బనేగా కరోడ్ పతి మూడో సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ భారీ పారితోషికాన్నే అందుకున్నాడు. మూడో సీజన్ అన్ని ఎపిసోడ్ లకు కలిపి 75కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత క్యా ఆప్ పాంచ్ వీ పాస్ సె తేజ్ హై అంటూ మరో షో చేశాడు షారుక్. వీటికి ఎపిసోడ్ కి కోటి చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
            వీరి తర్వాత కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా దస్ కా దమ్ అంటూ స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఎపిసోడ్ కి కోటి రూపాయల చొప్పున డిమాండ్ చేశాడు. మొత్తం 30 ఎపిసోడ్లు చేశాడు. ఆ తరువాత రెండో సీజన్ లో రేటు కాస్త తగ్గించారు నిర్వాహకులు. దీంతో ఎపిసోడ్ కి 80 లక్షల చొప్పును మాత్రమే అందుకున్నాడు సల్మాన్. 
          డేర్ డెవిల్ రియాలిటీ షో ఖత్రోంకే ఖిలాడీకి హోస్ట్ గా చేశాడు అక్షయ్ కుమార్. అందుకు వారానికి కోటి 25 లక్షలు వసూలు చేశాడు. కానీ ఇదే షో రెండో సీజన్ లో ఎపిసోడ్ కు 95 లక్షలతో సరిపెట్టుకున్నాడు. అయితే వంటల ప్రోగ్రాం మాస్టర్ షెఫ్ ఇండియాకు భారీగానే డిమాండ్ చేశాడు. ఎపిసోడ్ కు కోటిన్నర అందుకున్నాడు.
         అందరికంటే కాస్త ఆలస్యంగా బుల్లితెరపై అడుపెట్టాడు ఛోటా బచ్చన్ అభిషేక్. నేషనల్ బింగో నైట్ రియాలిటీ షో చేసి ఎపిసోడ్ కు కోటి రూపాయలు అందుకున్నాడు.
             హీరోలే కాదు హీరోయిన్లు కూడా రియాలిటీ షోలలో సత్తా చాటారు. అక్షయ్ కుమార్ చేసిన ఖత్రోంకే ఖిలాడీని కంటిన్యూ చేసింది ప్రియాంకా చోప్రా. అందుకోసం ఎపిసోడ్ కు 60 లక్షలు అందుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోను రక్తికట్టించిన శిల్పాశెట్టి... వారానికి 45 లక్షల చొప్పున వెనకేసుకుంది. ప్రీతీజింటా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటూ ఒక షో చేసింది. ఎపిసోడ్ కు 45 లక్షల చొప్పున అందుకుంది. అటు బిగ్ స్క్రీన్ పై ఇటు స్మాల్ స్క్రీన్ పై అదరగొట్టిన ఈహీరోహీరోయిన్లు... స్టార్లు ఎక్కడున్నా స్టార్లే అని నిరూపిస్తున్నారు. అభిమానులను అలరిస్తూ... కాలవలసినంత వెనకేసుకుంటున్నారు.
         బిగ్ స్టార్లు స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో టీఆర్పీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అందుకే రియాలిటీ షోల నిర్వాహకులు బడాస్టార్లపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

26, ఆగస్టు 2012, ఆదివారం

బిగ్ స్క్రీన్ కు స్మాల్ స్క్రీన్ ఛాలెంజ్

బిగ్ స్క్రీన్ కు స్మాల్ స్ర్కీన్ ఛాలెంజ్ చేస్తోంది. చాలా స్పీడుగా దూసుకెళ్తున్న టెలీవుడ్... బిగ్ స్క్రీన్ కు దడపుట్టిస్తోంది. బడాబడా ప్రొడ్యూసర్లు కూడా టీవీ రియాలిటీ షోలు, ప్రోగ్రాంలు రూపొందించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. హిందీలో జితేంద్ర కుమార్తెలు శ్రీ బాలాజీ టెలీ ఫిలీంస్ పతాకంతో అరంగేట్రం చేసి ప్రస్తుతం పలు భాషల్లో సీరియల్స్ నిర్మిస్తూ... దాదాపు 500 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. దక్షిణాదిలో రాధిక... రాడాన్ పిక్చర్స్ పై సీరియళ్లు నిర్మిస్తూ వాటిని పలు భాషల్లోకి డబ్బింగ్ చేస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ చేస్తోంది. మన వద్ద గతంలో సురేష్ ప్రొడక్షన్స్ సీరియల్స్ తీయగా... ప్రస్తుతం దాసరి సౌభాగ్య మీడియా పతాకంపై, అక్కినేని అన్నపూర్ణ సంస్థ, శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల, అశ్వనీదత్ వైజయంతి సంస్థ, రామోజీరావు ఉషాకిరణ్ సంస్థ తెలుగు సీరియళ్లు, ఇతర కార్యక్రమాల రూపకల్పనలో మంచి జోరుమీదున్నాయి. ఇవేకాక అనేక సంస్థలు సీరియల్స్, గేమ్ షోలతో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.
                   బడా స్టార్లు కూడా ఈ బుల్లితెరపై కనిపించడానికి ఆరాటపడుతున్నారు. సినిమాలో నటించాలనే ఎంతోమందికి ఈ రంగుల కల... కలగానే మిగిలిపోతోంది. అలాంటివారి కల నిజం చేస్తోంది టీవీ తెర. స్మాల్ స్క్రీన్ ను ఓ వేదికగా మలుచుకుని వెండితెరపై వెలిగిపోవాలని తపించేవారు ఎందరో. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా బుల్లితెరనే కావడం విశేషం. మరోవైపు ఇన్నాళ్లు సినిమాల్లో అదరగొట్టిన సినీతారలు బుల్లితెరపై కనిపిస్తున్నారు. అందం, అభినయంతో వెండితెరపై అలరించిన హీరోయిన్లు ఎందరో స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు. మీనా, సిమ్రన్, రాశి, రోజా, ఆమని అందుకు ఉదాహరణ. బాలీవుడ్ బడాస్టార్లు... అటు బిగ్ బీ నుంచి ఇటు హీరోయిన్ల వరకు అందరూ రియాలిటీ షోల్లో అదరగొట్టిన... అదరగొడుతున్నవారే.
         ఒకప్పుడు యాడ్లలో తప్ప టీవీ తెరపై కనిపించడానికి ఇష్టపడని హీరోలు సైతం ఇప్పుడు బుల్లితెరపై కనిపించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటే... టెలీవుడ్ ఏ రేంజ్ కు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులకు చేరువ కావడంతోపాటు... రియాలిటీ షోలతో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు. సినిమా ఫంక్షన్ల నుంచి మ్యారేజ్ ల వరకు టీవీలలో లైవ్ కవరేజ్ ఇస్తున్నారంటే... స్మాల్ స్క్రీన్ సత్తాను అంచనా వేయొచ్చు. అందుకే ప్రస్తుత పరిస్థితులను చూస్తే టెలివిజన్ రంగం వెండితెరకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నట్లే కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 525 టీవీ ఛానెల్స్ లో 55 వరకు ఛానెళ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వీటిలో సగం ఎంటర్ టైన్మెంట్ ఛానళ్లే. వేలాదిమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లకు ఉపాధి మార్గంగా మారాయి ఈ ఛానెళ్లు.

21, ఆగస్టు 2012, మంగళవారం

సినిమా ప్రమోషన్ లో బాలీవుడ్ హీరోలే ది బెస్ట్

చక్కని కథ దొరికింది. దాన్ని అంతే అందంగా తెరకెక్కించారు దర్శకుడు. సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రోమోలు దంచేస్తున్నారు. కానీ హీరోగారు మాత్రం ప్రమోషన్ కు రారు. ఏ ఛానల్ కు వెళ్లరు. పబ్లిక్ తో అసలే ఇంటరాక్ట్ కారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి తలపట్టుకోవడం ప్రొడ్యూసర్ వంతవుతుంది. ఏడ్చినవాడి కళ్లు తుడిచినట్లు ఎట్టకేలకు మన హీరోలు ఒక ఇంటర్వ్యూను రికార్డు చేసి దాని కాపీలు అన్ని ఛానళ్లకు పంపిస్తారు. ఇక సినిమా రిలీజ్ అయ్యేవరకు ఏ ఛానల్లో చూసినా అదే ఇంటర్వ్యూ కనిపిస్తుంది. ప్రేక్షకులకే బోర్ కొట్టే వరకు అన్ని ఛానళ్లలో వస్తూనే ఉంటుంది. సినిమా హిట్టయితే అట్లాంటిదే మరో ఇంటర్వ్యూ వస్తుంది. లేదంటే ఇక అంతే సంగతులు. ఇదంతా మన టాలీవుడ్ లోనే చూస్తాం. కానీ బాలీవుడ్ హీరోలు అలాకాదు. చివరికి కోలీవుడ్ హీరోలు కూడా మన వద్దకు వచ్చి డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ చేస్తారు. అదే బాలీవుడ్ హీరోలైతే దేశమంతా కలియతిరిగి సినిమాను ప్రమోట్ చేస్తారు. ఎంత పెద్ద హీరో అయినా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లి సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడతారు. అంతేకాదు ఈ మధ్య బాలీవుడ్ హీరోలు సీరియళ్లను కూడా సినిమా ప్రమోషన్లకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్య రౌడీ రాథోడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా
 హీరోహీరోయిన్లు అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా సీఐడీ సీరియల్ లో హల్ చల్ చేశారు. సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ లో వచ్చే సీఐడీ సీరియల్ లో అక్షయ్ కుమార్ యాక్షన్ రోల్ పోషించారు. ఓ షాపింగ్ మాల్ లో ఓ విలన్ పిల్లాడిని కిడ్నాప్ చేస్తాడు. సీఐడీ వాళ్లు అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించగా పిల్లాడిని చంపేస్తానని బెదిరిస్తాడు విలన్. అదే టైంలో హీరోయిన్ తో  కలిసి షాపింగ్ కు వచ్చిన హీరో అక్షయ్ కుమార్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి విలన్ పై దూకి పిల్లాడిని కాపాడతాడు. ఆ తర్వాత సీఐడీ టీంతోపాటు అక్కడున్నవారి ప్రశంసలు అందుకుంటారు. అక్కడ తనను తాను రౌడీ రాథోడ్ గానే పరిచయం చేసుకుంటాడు అక్షయ్ కుమార్. ఈ సీరియల్ లో కొద్దిసేపే కనిపించినా సినిమా ప్రమోషన్ చేసి వెళ్తారు హీరోహీరోయిన్లు. అంతకు ముందు దబంగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సల్మాన్ ఖాన్ పోలీస్ గెటప్ లోనే కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘లాగి తుజ్ సే లగాన్’ సీరియల్ లో కనిపించి సినిమా ప్రమోషన్ చేశారు. సీరియల్ లో హీరోయిన్ ఆత్మహత్య చేసుకోడానికి రోడ్డుపై వెళ్తుంటే ఎదురుగా లారీ వస్తుంది. యాక్సిడెంట్ అవుతుందనుకున్న టైంలో ఓ పోలీస్ జీపు వచ్చి లారీకి అడ్డంగా నిల్చుంటుంది. ఎవరా అని హీరోయిన్ ఆశ్చర్యంగా చూస్తుండగానే జీపులోంచి హీరో సల్మాన్ ఖాన్ దిగుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ లో ఆత్మస్తైర్యం నింపుతాడు. 
ఇక రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ పైరసీని అరికట్టడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా సీఐడీ సీరియల్ నే ఉపయోగించుకున్నారు. వాంటెడ్, బాడీగార్డ్ సినిమాలు పైరసీ అయ్యాయని... వాటిపై సీఐడీ టీంకు ఇన్ ఫాం చేస్తాడు. పైరసీకి పాల్పడుతున్నవారిని పట్టుకోడానికి సహకరిస్తాడు సల్మాన్. ఆ తర్వాత సీఐడీ టీం పైరసీకి పాల్పడే ముఠాను పట్టుకోవడంతో పైరసీ సీడీలను సల్మాన్ కాల్చేస్తారు. పైరసీకి పాల్పడవద్దని... పైరసీ సీడీలను చూడొద్దని... దీనివల్ల కోట్లు ఖర్చుచేసి సినిమా తీసిన ప్రొడ్యూసర్ నష్టపోతాడని సందేశం ఇస్తాడు. ఈ రెండు సీరియళ్లను కూడా డబ్బింగ్ చేసి మాటీవీ తెలుగులో ప్రసారం చేస్తోంది.  ఇన్వెస్టిగేషన్ సీరియల్ సీఐడీని అదే పేరుతో ప్రసారం చేస్తుండగా... ‘లాగి తుజ్ సే లగాన్’ సీరియల్ ను ‘వసంత కోకిల’ పేరుతో ప్రసారం చేస్తోంది మాటీవీ.

      మరి మన తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితేంటి. ఎప్పుడైనా పైరసీ సీడీలు పట్టుబడితే గగ్గోలు పెడుతారు. ఆ తర్వాత దానిగురించి ఎవరూ పట్టించుకోరు. సో, సినిమా ప్రమోషన్ అయినా... పైరసీపై పోరాడాలన్నా బాలీవుడ్ ను చూసి మన టాలీవుడ్ నేర్చుకోవల్సింది చాలా ఉందనడంలో సందేహం లేదు.  http://www.youtube.com/watch?v=Aj_H5NutfXs
http://www.youtube.com/watch?v=qLkBV-B_7wo
http://www.youtube.com/watch?v=w3d9umf-bFU&feature=related
http://www.youtube.com/watch?v=mJck7p8mIo8 

12, ఆగస్టు 2012, ఆదివారం

బాలీవుడ్ స్టార్లకు టోన్డ్ బాడీ మేనియా

 చక్కనమ్మ చిక్కినా అందమే. అందుకే బాలీవుడ్ భామలంతా ఆమధ్య జీరోసైజ్ జపం చేశారు. కానీ లేటెస్ట్ గా రూట్ మార్చారు. ఇప్పుడంతా టోన్డ్ బాడీనే. ఈ లిస్టులో బాలీవుడ్ హీరోలు కూడా చేరిపోయారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ పక్కనపెట్టి టోన్డ్ బాడీపై మోజు పడ్డారు. మన తెలుగు కుర్రహీరోలు కొందరు కూడా వీరినే ఫాలో అవుతున్నారు. ఇంకేం ఈ హీరోహీరోయిన్లంతా ఎప్పుడు చూసినా జిమ్ లలోనే దర్శనమిస్తున్నారు. 
  కండల వీరుడు సల్లూభాయ్... ప్రతి సినిమాలో ఒక్కసారైనా కండలు చూపిస్తాడు. లేకుంటే అభిమానులు ఊరుకోరట. ఇక తమ ఫ్యాన్స్ చిన్నబుచ్చుకుంటున్నారని కాబోలు షారుక్ ఖాన్, హ్రుతిక్ రోషన్ లు కూడా సినిమాల్లో కండలు చూపించారు. దీంతో వీరి అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ ఇప్పుడీ క్రేజ్ తగ్గి టోన్డ్ బాడీపై మోజు పెరిగింది. టోన్డ్ బాడీ అంటే... కాలి వేలి నుంచి తల వరకు అన్ని అవయవాలు సమపాళ్లలో ఉండాలి. బాడీలోని అధిక కొవ్వు కరిగించేయాలి. పొట్ట కండరాలు ఉబికి రావాలి. బరువు అదుపులో ఉండాలి. ఇక అమ్మాయిలైతే కాలిపిక్కలు, నడుము, పొట్టభాగం అన్నీ చెక్కిన శిల్పంలా అందంగా అమరాలి.
  మొన్నటి సంజూబాబా నుంచి ఇటీవలే తెరంగేట్రం చేసిన రణ్ వీర్ సింగ్ దాకా అందరిదీ టోన్డ్ బాడీ బాటనే. ఓం శాంతి ఓంలో సిక్స్ ప్యాక్ తో అలరించిన షారుఖ్... ఆ తర్వాత వాటిపై పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు. కానీ ఇప్పుడు మళ్లీ జిమ్ లో కనిపిస్తున్నాడు. అట్రాక్టివ్ గా కనిపించేందుకు కండలకు పనిచెప్పాడు. ఈ న్యూ లుక్ తో చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో అభిమానులను అలరించబోతున్నాడు కింగ్ ఖాన్. ఇక భారీ శరీరం. యాభై ఏళ్ల వయసు... అయినా సరే అందంగా కనిపించాలనే ఆరాటం సంజయ్ దత్ ది. కొత్త సినిమాలో టోన్డ్ బాడీతో కనిపించాలనే కసితో జిమ్ కే పరిమితమయ్యాడు సంజయ్ దత్. చాక్లెట్ బాయ్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినిమా సినిమాకీ ఫిజిక్ పెంచుతున్న షాహిద్ కపూర్... ఇప్పుడు టోన్డ్ బాడీతో చెలరేగి పోతున్నాడు. ఇక వీరినే ఫాలో అవుతున్నారు మన కుర్రహీరోలు రానా, నవదీప్, సుధీర్. రానా ఏకంగా సిక్స్ ప్యాక్ తోపాటు టోన్డ్ బాడీతోనూ రెడీ అయిపోయాడు. ఈ ఫిజిక్ చూసి బిపాసా తెగ ఇంప్రెస్ అయిపోయిందట. రానాను పొగడ్తల్లో ముంచెత్తుతోందట.
 వీళ్లేకాదు... హ్రుతిక్ రోషన్, జాన్ అబ్రహం, రణ్ వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సల్మాన్ ఖాన్ లు సైతం బాడీని టోన్డ్ బాడీగా తీర్చిదిద్దుకున్నవారే. అభిమానులను ఆకట్టుకునే శరీరాన్ని మలుచుకున్నవాళ్లే. ఇక టోన్డ్ బాడీ బిల్డింగ్ లో హీరోయిన్లదీ పెద్ద లిస్టే ఉంది. ఎందుకంటే అందంలో ముందుండేది ఈ ముద్దుగుమ్మలే కదా. నాజూకు చిన్నది కంగనా రనౌత్ టోన్డ్ బాడీ కోసం తెగ కష్టపడుతోంది. రోజూ యోగాసనాలు వేస్తోంది. కరాటే, జూడో, తైక్వాండో, కిక్ బాక్సింగ్ లాంటి సాహస విద్యల్నీ నేర్చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే టోన్డ్ బాడీలో కంగనా కంటే ముందుంది జీరో సైజ్ బెబో కరీనా కపూర్. చమ్మక్ చల్లో జోరుకు ముందే టోన్డ్ బాడీతో నిగారింపుతెచ్చుకుంది.
 ఆరెంజ్ భామ షాజహాన్ పదమ్ సీ అయితే ఏకంగా మిగతా హీరోయిన్లకు మోడల్ గా నిలిచేంతగా బాడీని సొంతం చేసుకుంది. కత్తిలాంటి కత్రినా గురించి అసలు చెప్పనే అవసరం లేదు. పాలమీగడలాంటి శరీర ఛాయ, మెరిసిపోయే అందం కత్రినా సొంతం. ఇక కత్తిలా ఉండే మరో భామ దీపికా పదుకొనే. ఈ సుకుమారి కష్టమైన కసరత్తులన్నీ చేసి అందరినీ అట్రాక్ట్ చేసేటంత ఆకర్షణీయంగా మారింది.
 టోన్డ్ బాడీ... సొంత చేసుకున్నవారు కొత్త నిగారింపుతో మెరిసిపోతారు. పెరిగిన ఆత్మవిశ్వాసంతో మురిసిపోతారు. కానీ శరీరాక్రుతి చక్కగా మారాలంటే జిమ్ లో కష్టమైన ఎక్సర్ సైజులు చేయాలి. కొన్ని త్యాగాలు తప్పవు. కేలరీల లెక్కన ఆహారాన్ని కొలిచి మరీ తినాలి. దీనికితోడు ఖరీదైన డైటీషియన్, యోగా గురువు, ఫిట్ నెస్ ట్రైనర్ కంపల్సరీ. ఎగ్జామ్ పుల్ గా షాహిద్ నే తీసుకోండి... టోన్డ్ బాడీ కోసం ఫేమస్ ఫిట్ నెస్ ట్రైనర్ అబ్బాస్ అలీని శిక్షకుడిగా నియమించుకున్నాడు. ఇక జాన్ అబ్రహం కిక్కురుమనకుండా వినోద్ చన్నా చెప్పింది విన్నాడు. నాన్ వెజ్ ను ఇష్టంగా తినే దీపికా పూర్తిగా ఆహార నియమాలనే మార్చేసింది. ఐదుగంటలకే లేచి బ్యాడ్మింటన్ ఆడేది. క్షణం తీరిక దొరికితే పైలేట్ వ్యాయామాలు చేసేది. ఇక పెద్దమొత్తంలో బరువు తగ్గాలనుకునే వాళ్లకి తేలికైన కార్బోహైడ్రేట్లు, కాటేజ్ ఛీజ్, సూప్, ప్రొటీన్ సప్లిమెంట్లు, బ్రౌన్ రైస్, పండ్ల రసాలు, తీపి బంగాళదుంపలే ఆహారం. దానికి తగ్గట్లు జిమ్ లు, కార్డియో వర్కవుట్లు కంపల్సరీ. ఇలా ఎన్ని త్యాగాలు చేయాలో మరి.