21, ఆగస్టు 2012, మంగళవారం

సినిమా ప్రమోషన్ లో బాలీవుడ్ హీరోలే ది బెస్ట్

చక్కని కథ దొరికింది. దాన్ని అంతే అందంగా తెరకెక్కించారు దర్శకుడు. సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రోమోలు దంచేస్తున్నారు. కానీ హీరోగారు మాత్రం ప్రమోషన్ కు రారు. ఏ ఛానల్ కు వెళ్లరు. పబ్లిక్ తో అసలే ఇంటరాక్ట్ కారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి తలపట్టుకోవడం ప్రొడ్యూసర్ వంతవుతుంది. ఏడ్చినవాడి కళ్లు తుడిచినట్లు ఎట్టకేలకు మన హీరోలు ఒక ఇంటర్వ్యూను రికార్డు చేసి దాని కాపీలు అన్ని ఛానళ్లకు పంపిస్తారు. ఇక సినిమా రిలీజ్ అయ్యేవరకు ఏ ఛానల్లో చూసినా అదే ఇంటర్వ్యూ కనిపిస్తుంది. ప్రేక్షకులకే బోర్ కొట్టే వరకు అన్ని ఛానళ్లలో వస్తూనే ఉంటుంది. సినిమా హిట్టయితే అట్లాంటిదే మరో ఇంటర్వ్యూ వస్తుంది. లేదంటే ఇక అంతే సంగతులు. ఇదంతా మన టాలీవుడ్ లోనే చూస్తాం. కానీ బాలీవుడ్ హీరోలు అలాకాదు. చివరికి కోలీవుడ్ హీరోలు కూడా మన వద్దకు వచ్చి డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ చేస్తారు. అదే బాలీవుడ్ హీరోలైతే దేశమంతా కలియతిరిగి సినిమాను ప్రమోట్ చేస్తారు. ఎంత పెద్ద హీరో అయినా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లి సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడతారు. అంతేకాదు ఈ మధ్య బాలీవుడ్ హీరోలు సీరియళ్లను కూడా సినిమా ప్రమోషన్లకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్య రౌడీ రాథోడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా
 హీరోహీరోయిన్లు అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా సీఐడీ సీరియల్ లో హల్ చల్ చేశారు. సోనీ ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్ లో వచ్చే సీఐడీ సీరియల్ లో అక్షయ్ కుమార్ యాక్షన్ రోల్ పోషించారు. ఓ షాపింగ్ మాల్ లో ఓ విలన్ పిల్లాడిని కిడ్నాప్ చేస్తాడు. సీఐడీ వాళ్లు అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించగా పిల్లాడిని చంపేస్తానని బెదిరిస్తాడు విలన్. అదే టైంలో హీరోయిన్ తో  కలిసి షాపింగ్ కు వచ్చిన హీరో అక్షయ్ కుమార్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి విలన్ పై దూకి పిల్లాడిని కాపాడతాడు. ఆ తర్వాత సీఐడీ టీంతోపాటు అక్కడున్నవారి ప్రశంసలు అందుకుంటారు. అక్కడ తనను తాను రౌడీ రాథోడ్ గానే పరిచయం చేసుకుంటాడు అక్షయ్ కుమార్. ఈ సీరియల్ లో కొద్దిసేపే కనిపించినా సినిమా ప్రమోషన్ చేసి వెళ్తారు హీరోహీరోయిన్లు. అంతకు ముందు దబంగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో సల్మాన్ ఖాన్ పోలీస్ గెటప్ లోనే కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘లాగి తుజ్ సే లగాన్’ సీరియల్ లో కనిపించి సినిమా ప్రమోషన్ చేశారు. సీరియల్ లో హీరోయిన్ ఆత్మహత్య చేసుకోడానికి రోడ్డుపై వెళ్తుంటే ఎదురుగా లారీ వస్తుంది. యాక్సిడెంట్ అవుతుందనుకున్న టైంలో ఓ పోలీస్ జీపు వచ్చి లారీకి అడ్డంగా నిల్చుంటుంది. ఎవరా అని హీరోయిన్ ఆశ్చర్యంగా చూస్తుండగానే జీపులోంచి హీరో సల్మాన్ ఖాన్ దిగుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ లో ఆత్మస్తైర్యం నింపుతాడు. 
ఇక రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ పైరసీని అరికట్టడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా సీఐడీ సీరియల్ నే ఉపయోగించుకున్నారు. వాంటెడ్, బాడీగార్డ్ సినిమాలు పైరసీ అయ్యాయని... వాటిపై సీఐడీ టీంకు ఇన్ ఫాం చేస్తాడు. పైరసీకి పాల్పడుతున్నవారిని పట్టుకోడానికి సహకరిస్తాడు సల్మాన్. ఆ తర్వాత సీఐడీ టీం పైరసీకి పాల్పడే ముఠాను పట్టుకోవడంతో పైరసీ సీడీలను సల్మాన్ కాల్చేస్తారు. పైరసీకి పాల్పడవద్దని... పైరసీ సీడీలను చూడొద్దని... దీనివల్ల కోట్లు ఖర్చుచేసి సినిమా తీసిన ప్రొడ్యూసర్ నష్టపోతాడని సందేశం ఇస్తాడు. ఈ రెండు సీరియళ్లను కూడా డబ్బింగ్ చేసి మాటీవీ తెలుగులో ప్రసారం చేస్తోంది.  ఇన్వెస్టిగేషన్ సీరియల్ సీఐడీని అదే పేరుతో ప్రసారం చేస్తుండగా... ‘లాగి తుజ్ సే లగాన్’ సీరియల్ ను ‘వసంత కోకిల’ పేరుతో ప్రసారం చేస్తోంది మాటీవీ.

      మరి మన తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితేంటి. ఎప్పుడైనా పైరసీ సీడీలు పట్టుబడితే గగ్గోలు పెడుతారు. ఆ తర్వాత దానిగురించి ఎవరూ పట్టించుకోరు. సో, సినిమా ప్రమోషన్ అయినా... పైరసీపై పోరాడాలన్నా బాలీవుడ్ ను చూసి మన టాలీవుడ్ నేర్చుకోవల్సింది చాలా ఉందనడంలో సందేహం లేదు.  http://www.youtube.com/watch?v=Aj_H5NutfXs
http://www.youtube.com/watch?v=qLkBV-B_7wo
http://www.youtube.com/watch?v=w3d9umf-bFU&feature=related
http://www.youtube.com/watch?v=mJck7p8mIo8 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి